పోలవరం విషయం లో చంద్రబాబు రెండు నాల్కలు

CPI Ramakrishna Fires on Chandrababu Naidu

ప్రతీ విషయం లో రెండు నాల్కల ధోరణి లో ఉండే చంద్రబాబు గారు పోలవరం విషయం లో కూడా రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండి పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధక నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్యాకేజీ తీసుకున్నందువల్లే పోలవరం ప్రాజెక్టు వచ్చిందనీ - ప్రత్యేక హోదా వదులుకున్నందుకు ఫలితం ఇదని చెప్పడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.  

పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని ఏపీ. పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరచబడిందనీ దానిమేరకు పోలవరానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందే తప్ప ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నా నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మించక తప్పదనే విషయాన్ని బాబు దాచిపెట్టడం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడులు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వీరికి మోడీ వద్ద మాట్లాడే ధైర్యం లేక - తప్పడు ప్రచారాలు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

40 వేల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వచ్చేచోట 2 వేల కోట్ల రూపాయలొస్తే అదే మహా ప్రసాదం అన్నట్లు అదంతా తనవల్లే సాధ్యమైనన్నట్లు ముఖ్యమంత్రి చెప్పకోవడం దుర్మార్గమన్నారు. పోలవరం నిర్వాసితులకు కూడా చట్టపరంగా న్యాయం చేయడంలో విఫలం చెందారని రామకృష్ణ తెలిపారు. 10 - 15 ఏళ్ళు ప్రత్యేక హోదా అంటూ ఆశలు రేకెత్తించిన చంద్రబాబు - వెంకయ్యలు అధికారంలోకి వచ్చాక పదవీకాంక్షతో ఒకరు - తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మరొకరు ప్రత్యేక హోదాకు తూట్ల పొడిచారని విమర్శించారు. ప్రచార ఆర్భాటాలతో తప్పడు వాగ్దానాలతో అవాస్తవాలను చెపుతున్న చంద్రబాబు - వెంకయ్యలకు రాబోయే కాలంలో ప్రజలే బుద్ధిచెపుతారని రామకృష్ణ అన్నారు. 2018కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా కేంద్ర మంత్రులంతా చెప్తున్నారనీ 2018కల్లా పూర్తి చేసే పక్షంలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధకం ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.


Facebook

Videos