నోబెల్ కొట్టండి... 100 కోట్లు గెలవండి

Bring Nobel Prize to Andhra Pradesh Take Rs 100 crore : Chandrababu Naidu

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా వంద కోట్ల రూపాయలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇస్తానన్న మొత్తం ఇది. ఎవరికంటే... నోబెల్ బహుమతి సంపాదిస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తానని తిరుపతి సైన్స్ కాంగ్రెస్ లో ఆయన చెప్పారు. పిల్లల్లో హుషారు రప్పించడానికి చెప్పారో..? లేకపోతే నోబెల్ ప్రైజ్ ఎలా వస్తుందో సరైన అంచనా లేకనే ఆయన ఈ మాట అన్నారో తెలియదు కానీ... చంద్రబాబు మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.

దేశంలో యువత సాధించలేనిది ఏదీ లేదన్న సీఎం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారంటూ కితాబునిచ్చారు. ఇంతవరకు సరే. ఎంత మంది తెలివైన వారున్నా నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆంధ్రులు లేరన్నారు. ఆ కొరత తనకు అలాగే ఉండిపోయిందని బాధ పడ్డారు కూడా. నోబెల్ బహుమతి తేగలితే ఏకంగా 100 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామంటూ చంద్రబాబు అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రకటన స్టూడేంట్స్ లో స్ఫూర్తిని నింపాలన్నారు. అయితే మాములుగా ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో పథకాలు సాధిస్తే కోట్లు ఇస్తామని, క్రికెట్ కప్ కొడితే కిరీటాలు పెడుతామని చెప్పేవారు ఉన్నారు తప్ప నోబెల్ కొట్టండి... 100 కోట్లు గెలవండి అని చెప్పిన వారు మాత్రం లేదు.

ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేకం. మరి నోబెల్ బహుమతి గెలవాలంటే.. ఊరికనే వస్తుందా? అది ఎలా సాధ్యం? ఎవరికి సొంతం? అంటే వచ్చే జవాబు ఒక్కటే. అది కేవలం చంద్రబాబుకే సాధ్యం. ఎందుకంటారా? సెల్ ఫోన్ ను పరిచయం చేసింది చంద్రబాబు గారే. ఐటీని తీసుకొచ్చిందీ ఆయనే. ఇంటర్నెట్ అభివృద్ధి చేసింది కూడా బాబే. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఉన్నారంటే దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రివర్యులే. అలాగే పీవీ సింధుకు ఒలింపిక్స్ లో పతకం వచ్చిందంటే అదీ ఆయన పుణ్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించినవి చాలానే ఉన్నాయి. ఈ విషయాలన్నీ స్వయంగా చంద్రబాబు కొన్ని వేలసార్లు చెప్పుకున్నారు. ఈ ఘనతలన్నీ నోబెల్ బహుమతిని ఎంపిక చేసే జ్యూరీకి తెలిస్తే చంద్రబాబు కల నెరవేరి తీరుతుంది. ఎందుకంటే అన్ని ఘనతలు సాధించిన వ్యక్తి ఈ భూ ప్రపంపంచై కేవలం ఒక్క చంద్రబాబే ఉన్నారు. సో నోబెల్ బాహుమతి చెందాల్సింది ఆయనకే. ఈ లెక్కన ఏపీ సర్కారు తరఫున ఆ వంద కోట్లు కూడా బాబుగారి సొంతం అయిపోతాయి. 


Facebook

Videos