రైజింగ్ పూణె చేతిలో చిత్త‌యిన ముంబై ఇండియ‌న్స్‌...

Raising pune super victory over mumbai indians goes to final

పుణె పోరాటపటిమ ముందు ముంబై మోకరిల్లింది. లీగ్‌లో మేటి జట్లను మట్టికరిపిస్తూ టాప్‌లో నిలిచిన ముంబైని పుణె మరోమారు మట్టికరిపించింది. ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లోకి అడుగుపెడుదామనుకున్న రోహిత్‌సేన ఆశలను పుణె వమ్ముచేసింది.

మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పుణె 20 పరుగుల తేడాతో ముంబైపై అద్భుత విజయం సాధించి ఫైన‌ల్ బెర్త్‌ను కారారు చేసుకుంది.
తొలుత టాస్‌గెలిచిన ముంబై ఇండియన్స్..పుణెను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రహానే(43 బంతుల్లో 56, 5ఫోర్లు, సిక్స్),మనోజ్‌తివారీ(48 బంతుల్లో 58, 4ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలకు తోడు ఆఖర్లో ధోనీ (26 బంతుల్లో 40 నాటౌట్, 5సిక్స్‌లు) దంచుడు తోడవ్వడంతో పుణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది.మొదట్లో కొంత తడబడ్డా చివర్లో ధోనీ, తివారీ బ్యాటింగ్‌తో పుంజుకుని ముంబై ముందు గౌరవప్రదమైన స్కోరును నిర్దేశించింది.

ఓ స్థితిలో పుణె కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ ధనాధన్ ధోనీ..తనదైన శైలిలో చెలరేగడం కలిసొచ్చింది. మెక్‌క్లీగన్ వేసిన 19వ ఓవర్లో ధోనీ 2 భారీ సిక్స్‌లకు తోడు మనోజ్ సిక్స్, ఫోర్‌తో ఏకంగా 26 పరుగులు జతకలిశాయి. అదే జోరు కొనసాగిస్తూ..బుమ్రా ఆఖరి ఓవర్లోనూ మహీ కండ్లు చెదిరే సిక్స్‌లతో పుణె 162 పరుగుల మార్క్ అందుకుంది. చాలా రోజుల తర్వాత ధోనీ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో రెచ్చిపోవడంతో వాంఖడే హోరెత్తిపోయింది.

 

పుణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 142/9 స్కోరుకు పరిమితమైంది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్(3/16) స్పిన్‌కు తోడు శార్దుల్ ఠాకూర్(3/37) పేస్‌తో వాంఖడేలో ముంబై గజగజ వణికిపోయింది. సిమ్మన్స్(5) రనౌట్‌తో మొదలైన ముంబై వికెట్ల పతనం దిగ్విజయంగా కొనసాగింది. సుందర్ తన రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్‌శర్మ(1)తో పాటు రాయుడు(0)ను ఔట్ చేసి ముంబైని ఘోరంగా దెబ్బకొట్టాడు. వీరిని అనుసరిస్తూ పొలార్డ్(7) కూడా సుందర్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.పండ్యాసోద‌రులు కూడా వెనుతిర‌గ‌డంతో ఓట‌మిని చ‌విచూసింది.
ఐపీఎల్ 10 సీజ‌న్‌లో ఫైన‌ల్ బెర్త్ క‌రారు చేసుకుంది రైజింగ్ పూణె..ఈరోజు గ‌రినే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ,కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ల‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుతో ఫైన‌ల్లో రైజింగ్ పూణె త‌ల‌ప‌డ‌నుంది.

Also read

  1. నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో దుమ్ము రేపిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు
  2. ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భార‌త జ‌ట్టుకు స‌చిన సందేశం
  3. స‌చిన్ ..స‌చిన్ ..స‌చిన్‌ ఎలా వ‌చ్చిందో తెలుసా...
  4. ఐసీసీ ఛాంఫియ‌న్స్ ట్రోపి జ‌ట్టు ఇదే.

Facebook

Videos